కాలం మారింది. అవసరాలు మారాయి. ఇప్పుడు కండబలం కంటే బుద్ధి బలానికి.. మేధస్సుకు ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా పలు కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే.. చైనాలో సంపన్నుల సంఖ్య అంతకంతకు భారీగా పెరిగిపోతున్నారు. పూర్తిగా ఐరన్ కర్టెన్ వేసి ఉంచే చైనాలో ఇప్పుడో కొత్త అంశం ట్రెండింగ్ గా మారిందట.
చైనాలోని సంపన్నులు ఇటీవల కాలంలో కొత్తతరహా బాడీ గార్డులను కోరుకుంటున్నారు. కండ బలం మాత్రమే కాదు.. కొత్త తరహా బాడీగార్డులకు డిజిటల్ డార్క్ ఆర్ట్స్ లోనూ నైపుణ్య ఉంటే వారికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. చాలామంది సంపన్నులకు ఈ తరహా బాడీ గార్డులు దొరక్క విలవిలలాడిపోతున్నారు. ఈ కొరతను గుర్తించిన తియాంజిన్ లోని గెంఘిన్ సెక్యూరిటీ అకాడమీలో ఇప్పుడు కొత్త తరహా బాడీగార్డులకు శిక్షణ ఇస్తున్నారట.
డిజిటల్ యుగంలో హ్యాకర్లతో అనుక్షణం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. చైనాలోని సంపన్నులంతా ఈ రంగంలో శిక్షణ పొందిన గార్డులకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతానికి చైనాలో 44లక్షల మంది మిలియనీర్లు ఉన్నట్లుగా తేల్చారు. వీరందరి అవసరాల్ని తీర్చేందుకు గెంఘిన్ అకాడమీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కోర్సును డిజైన్ చేశారు. ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుందని చెబుతున్నారు.
ఏడాదికి వెయ్యి మంది కొత్తతరహా బాడీ గార్డుల్ని తయారు చేస్తున్నట్లుగా అకాడమీ ఛైర్మన్ చెబుతున్నారు. ఈ కొత్త తరహా బాడీగార్డులు ఇప్పటికే పలువురు ప్రముఖులను సమస్యల నుంచి బయటపడేసినట్లుగా అకాడమీ ఛైర్మన్ చెబుతున్నారు. కోర్సులో జాయిన్ కావాలంటే 3వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటికి మించి ఈ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుందట. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కోర్సులో జాయిన్ అయిన వారిలో సగానికి పైగా మిలటరీలో పని చేసి వచ్చిన వారే కావటం గమనార్హం.
ఈ కొత్త తరహా బాడీగార్డులకు చెప్పే ప్రాథమిక పాఠం.. మీరు ఫైట్ చేయాలని మీ బాస్ కోరుకోరు. కానీ.. ఒక వీడియో ఫైల్ ను ధ్వంసం చేయాలని కోరచ్చని.. దేనికైనా రెఢీ అన్నట్లుగా ఈ కొత్త తరహా బాడీగార్డుల్ని తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. కోర్సు పూర్తి అయి బయటకు వచ్చినంతనే.. వీరికి ఉద్యోగాలు లభిస్తున్నట్లుగా చెబుతున్నరు.
కోర్సులో భాగంగా భౌతిక దేహధార్యంతో పాటు.. డిజిటల్ అంశాల మీద పట్టు ఉండేలా శిక్షణ ఇస్తున్నారు. చూస్తుంటే.. మన దేశంలోకి ఈ తరహా బాడీగార్డుల ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లు త్వరలోనే వచ్చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.