చెప్పేటోడు ఉండాలే కానీ వినేటోడు చెలరేగిపోతాడని ఊరికే అనలేదేమో? ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న కోవిడ్ -19 పాపం ముమ్మాటికి డ్రాగన్ దే అయినా.. ఇప్పుడా దేశం తన తప్పును ప్రపంచం మీదకు తోసేందుకు సిద్ధమవుతోంది. ఆధునిక ప్రపంచంలో వైరస్ కారణంగా ఇంత భారీగా మరణాలు.. అందునా ప్రపంచ దేశాలన్నింటిలోచోటు చేసుకోవటం ఇదే తొలిసారి. ఎక్కడిదాకానో ఎందుకు.. మనిషి ప్రాణానికి అపరిమితమైన విలువను ఇచ్చే అమెరికాలో.. ఆ దేశస్తులు దగ్గర దగ్గర 2.18లక్షల మంది మరణించటం సామాన్యమైన విషయం కాదు.
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న అధికారిక మరణాలు మిలియన్ దాటగా.. అనధికారిక మరణాలు అంతకు మించే ఉంటాయని చెప్పక తప్పదు. ఇంత మారణహోమానికి కారణం వైరస్. రోజులు గడుస్తున్న కొద్దీ వైరస్ తీవ్రత ప్రపంచానికి అర్థం కావటమే కాదు.. చైనా మీద ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. ఇప్పటివరకు తాను చెప్పిన మాటల్ని మొత్తంగా మార్చేసే కొత్త ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చింది చైనా.
కోవిడ్ 19 చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని చుట్టుముట్టిందన్న విషయాన్ని చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతాడు. కానీ.. చైనా మాత్రం అందుకు భిన్నమైన వాదనను మొదలు పెట్టింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ పుట్టిందని.. కాకుంటే తాము అందరికంటే ముందు కనిపెట్టి అలెర్టు చేశామని చెబుతోంది. తాము అలెర్టు చేయటం వల్ల ప్రపంచానికి మేలు జరిగినట్లుగా గొప్పలు చెప్పుకునే కార్యక్రమానికి తెర తీసింది.
చైనాలోని ప్రయోగశాల నుంచి ఈ వైరస్ బయటకు వచ్చిందని అమెరికా ఆరోపిస్తే.. వూహాన్ జంతువుల మార్కెట్.. గబ్బిలాల నుంచి మహమ్మారి వ్యాపించిందని జరుగుతున్న ప్రచారం తప్పని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఖండించారు. వైరస్ జన్యుక్రమాన్ని ప్రపంచానికి అందజేసింది తామేనని చెబుతోంది. ఇంతకాలం చైనా చెప్పిన మాటలకు భిన్నమైన మాటలు ఎందుకు చెబుతున్నట్లు అంటే దానికో కారణం లేకపోలేదు.
కరోనా వైరస్ మూలాలు కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో దర్యాప్తు టీంను ఏర్పాటు చేయనుంది.
ఈ నేపథ్యంలోనే తన దరిద్రపుగొట్టు వాదనను వినిపించటం షురూ చేసిందని చెప్పాలి. తనకు మేలు జరగాలని ఫీల్ కావాలే కానీ.. ఈ వైరస్ మూలానికి అమెరికా.. భారతేనని.. అమెరికా సాయంతో భారత్ లో తయారు చేసి.. వూహాన్ లో వదిలారన్న సినిమాటిక్ స్టేట్ మెంట్లు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన చైనా.. ఇప్పుడు తన తప్పేం లేదంటూ అమాయకంగా చెబుతున్న మాటల్ని విన్నోళ్లంతా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.