ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిని మార్చే ప్రయత్నం ఢిల్లీ నుంచే జరుగుతోందని, జగన్ కి కేంద్రం ఈ విషయంలో మద్దతు ఇస్తోందని సీపీఐ నేత నారాయణ ఆరోపణలు చేసిన రెండు రోజులకే ప్రధాన న్యాయమూర్తిని మార్చేస్తున్నారన్న వార్తలు రావడం కలకలం అయ్యింది. పక్కా సమాచారం తెలిశాకే లాబీయింగ్ చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఒక్క ఏపీ ప్రధాన న్యాయమూర్తే కాదని, దేశంలోని పలురాష్ట్రాల న్యాయమూర్తులను కూడా మారుస్తున్నారని తెలుస్తోంది.
ఒక్క జగన్ కోసం అయితే, అందరినీ మారుస్తారా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా… బదిలీకి ముందు నారాయణ ఆరోపణలు చేయడం వల్లే ఈ బదిలీ ఇంత సంచలనం అయ్యింది.ఎపి చీఫ్ జస్టిస్ జెకె మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం సిక్కిం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఎపి చీఫ్ జస్టిస్‌గా నియమించవచ్చు అని సమాచారం. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీతో పాటు మొన్ననే నియమితులైన తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కూడా బదిలీ అవుతున్నారు. అంతేకాదు వివిధ రాష్ట్రాల ఐదు నుంచి ఆరు మంది ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తున్నారు. ఇటీవల సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేవని ఏపీ హైకోర్టులు తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ కొన్ని వందల నిర్ణయాలు తీసుకుంటే హైకోర్టు తప్పుపట్టిన నిర్ణయాలు కనీసం పది శాతం కూడా లేవు. ఇవన్నీ వైసీపీ చేసిన రాజకీయ ఆరోపణలు మాత్రమే గాని జగన్ మీదనో, ప్రభుత్వం మీదనో కోర్టులకు ఎందుకు కోపాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి జగన్ సర్కారు రంగుల విషయంలో గాని, నిమ్మగడ్డ విషయంలో గాని, భూముల విషయంలో గాని న్యాయపరంగా వ్యవహరించకపోవడం వల్లే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అంటున్నారు. ఏపీ రాజధాని మార్చడం ఒక వ్యక్తిగత నిర్ణయంలా ఉంది. మార్చే ముందు దానికి భూములు ఇచ్చిన రైతులతో చర్చించలేదు. కాబట్టి ఏపీ హైకోర్టులోనే కాకుండా, సుప్రీంకోర్టులో కూడా అది జరగదు అన్న విషయం అందరకి తెలుసు అని న్యాయనిపుణులు చెబుతున్నారు.