చెత్త పన్ను పేరుతో వైసిపి ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తుంది. చెత్త పన్నేసి కట్టకపోతే సామాన్లు జప్తు చెయ్యడం, ఇంటి ముందు చెత్త వెయ్యడం నిత్యకృత్యంగా మారింది. జగన్ రెడ్డి చెత్త ముఖ్యమంత్రి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఘటన ఒక ఉదాహరణ.(1/4) pic.twitter.com/Mv6yEb3o7e
— Lokesh Nara (@naralokesh) August 24, 2022
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చుట్టూ నెలకొన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఒక అంశం వివాదాస్పదం అయి, కాస్త పరిస్థితి సద్దుమణుగుతోందని అనుకుంటుండగా
తాజాగా విజయనగరంలో ప్రభుత్వ సిబ్బంది చేసిన ఒక ‘చెత్త’ పని జగన్ సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత తెచ్చేలా కనిపిస్తోంది. ఈ ఉదంతం మీద సోషల్ మీడియాలో మామూలు వ్యతిరేకత కనిపించడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొత్తగా ప్రతి ఇంటి మీదా చెత్త పన్ను విధించడం తెలిసిందే. మున్సిపాలిటీలకు చెల్లించే ఇంటి, ఇతర పన్నులు చాలవని.. కొత్తగా చెత్త సేకరణ కోసం పన్ను చెల్లించాలనడంపై జనాల నుంచి వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈ డబ్బులు చెల్లించకుంటే చెత్త తీసుకెళ్లి ఇళ్ల ముందు పోయండి అంటూ ఓ సందర్భంలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొనడం గుర్తుండే ఉంటుంది. ఆయన మాటల స్ఫూర్తితోనో ఏమో విజయనగరంలో పారిశుద్ధ్య సిబ్బంది అదే పని చేశారు. ఒక ఇంటి యజమాని చెత్త పన్ను చెల్లించలేదని రోడ్డు మీదున్న చెత్తను బుట్టల్లో తీసుకెళ్లి ఆ ఇంటి కాంపౌండ్ లోపల పోశారు.
ఐతే చెత్త పన్ను కట్టనపుడు ఆ ఇంటిని చెత్తను తీయకుండా వదిలేశారంటే ఒక అర్థముంది. కానీ బయటి చెత్తను తీసుకొచ్చి ఇంట్లో పోయడం మాత్రం దారుణం. ఇప్పటికే జగన్ సర్కారు పనితీరుపై జనాల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుండగా.. ఇలా చేయడం ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తెచ్చేదే.
సోషల్ మీడియాలో దీని మీద టీడీపీ, జనసేన మద్దతుదారులే కాదు.. తటస్థులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వీడియోను బాగా వైరల్ చేసి జగన్ సర్కారు తీరును దుయ్యబడుతున్నారు. మరి ఈ చెత్త పని చేసిన సిబ్బందిపై ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా చర్యలుంటాయా.. లేక ఎప్పట్లాగే లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.