తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లు ఇవ్వలేదు. మరికొన్ని స్థానాల్లో టికెట్ ఆశించిన వాళ్లకు కేసీఆర్ వరమివ్వలేదు. దీంతో సహజంగానే అసంత్రుప్తి వ్యక్తమవుతుందనే సంగతి కేసీఆర్‌కు తెలియంది కాదు. అందుకు ముందు నుంచే సన్నద్ధమైన కేసీఆర్.. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది నాయకులను దారికి తెచ్చుకునే ప్రయత్నాలను ఆచరణలో పెడుతున్నట్లే కనిపిస్తున్నారు. అయినా వినకుండా పార్టీ మారే నాయకుల విషయంలో మాత్రం ఏం చేసేది లేదని కేసీఆర్ వదిలేస్తున్నట్లు టాక్.
వేములవాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈ సారి ఆయన్ని కాదని చల్మెడ లక్ష్మినరసింహారావుకు కేసీఆర్ టికెట్ కేటాయించారు. జర్మనీ పౌరసత్వం వివాదం కారణంగానే చెన్నమనేని రమేష్‌కు ఈ సారి కేసీఆర్ ఇవ్వలేదనే టాక్ ఉంది. కానీ ఎంతైనా చేతిలో నుంచి ఎమ్మెల్యే పదవి జారిపోతుందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ బాధనే చెన్నమనేని కూడా వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేనిని కేసీఆర్ నియమించారు. కేబినెట్ హోదా కలిగి ఉన్న ఈ పదవిలో ఆయన అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. మొత్తానికి కేబినెట్ హోదా ఉన్న పదవితో చెన్నమనేనిని ఓదార్చి కేసీఆర్ దారికి తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వేములవాడలో చల్మెడ విజయం కోసం చెన్నమనేని కూడా పని చేసేలా కేసీఆర్ సిద్ధం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాండూర్‌లో రోహిత్‌కు టికెట్ కేటాయించి, పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి అక్కడా విభేదాలు లేకుండా కేసీఆర్ పరిష్కరించారు. అంతే కాకుండా టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆశతోనే తాటికొండ రాజయ్య, రాథోడ్ బాపూరావు, గంప గోవర్ధన్ లాంటి నేతలున్నారు.