అనుకున్నదే అయ్యేలా ఉంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సొంతమైన ప్రత్యేక రికార్డు.. ఈసారి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా లీగ్‌లో ఆడిన ప్రతిసారీ సెమీస్ లేదా ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నై మాత్రమే అన్న సంగతి తెలిసిందే. నిషేధం వల్ల లీగ్‌కు దూరమైన 2016, 2017 సీజన్లలో మినహాయిస్తే ప్రతిసారీ ఆ జట్టు లీగ్ దశను దాటింది.
ఒకట్రెండు సీజన్లలో లీగ్ దశలో ఆ జట్టు తడబడ్డా.. సెమీస్/ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డా.. తర్వాత పుంజుకుని ముందంజ వేయగలిగింది. ఆడిన 10 సీజన్లలో తొమ్మిదిసార్లు ఫైనల్ చేరడం చెన్నైకే చెల్లింది. అందులో మూడుసార్లు విజేతగా నిలిచింది. నిషేధం తర్వాత పునరాగమనం చేసిన తొలి సీజన్లోనే చెన్నై టైటిల్ సాధించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. ఈసారి కూడా ఆ జట్టు మీద మంచి అంచనాలే ఉన్నాయి.
జట్టు కొంచెం అటు ఇటుగా అనిపించినా.. ధోని నాయకత్వంలో మరోసారి మ్యాజిక్ చేసి లీగ్‌లో దూసుకెళ్తుందనే అంతా అనుకున్నారు.కానీ అనుకున్నదానికి భిన్నంగా ఐపీఎల్-13లో పేలవ ప్రదర్శన చేసింది చెన్నై. 10 మ్యాచుల్లో ఆ జట్టు ఏడు ఓడిపోయింది. మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. మిగతా నాలుగు మ్యాచులూ గెలిచినా చెన్నై పాయింట్లు 14యే అవుతాయి.
గతంలో కొన్ని జట్లు 14 పాయింట్లతోనే ప్లేఆఫ్‌కు చేరాయి. కానీ అందుకు అన్ని రకాలుగానూ కలిసి రావాలి. మూడు జట్లకు మించి ఎనిమిది విజయాలు సాధించకూడదు. నెట్ రన్‌రేట్ విషయంలో చెన్నై మిగతా జట్లను దాటేయాలి. వేరే మ్యాచ్‌ల ఫలితాలు కూడా కలిసి రావాలి. కానీ అది సాధ్యం కావడం అంత సులువు కాదు.
అన్నిటికంటే ముందు ఇప్పటిదాకా పేలవ ప్రదర్శన చేసిన చెన్నై.. ఇప్పుడు ఒక్కసారిగా పుంజుకుని నాలుగుకు నాలుగు మ్యాచుల్లో గెలవగలదా అన్నది సందేహం. తర్వాతి మ్యాచ్‌లో బలమైన ముంబయి జట్టును ఢీకొనబోతోంది. అక్కడే చెన్నై కథ ముగిసిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. ఎలా చూసినా ఈసారి చెన్నై లీగ్ దశలోనే నిష్క్రమించి ప్రతిసారీ సెమీస్ లేదా ప్లేఆఫ్ చేరిన జట్టుగా తనకున్న రికార్డును కోల్పోవడం ఖాయమన్నదే విశ్లేషకుల అంచనా.