ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు ముందుకు వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం రాజధాని. క్యాపిటల్ ఎంత డెవలప్ అయిందో చూసి దానిని బట్టి భారీ పెట్టుబడులు పెట్టేందుక పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. ఉమ్మడి ఏపీ…ప్రస్తుత తెలంగాణలోని హైదరాబాద్ నగరం అందుకు నిలువెత్తు నిదర్శనం. కానీ, ఏపీలోని వైసీపీ నేతలకు మాత్రం ఈ ఫార్ములా వర్తించదట. అసలు పెట్టుబడులు పెట్టేందుకు రాజధానితో పనిలేదని స్వయంగా వైసీపీ నేత, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది.
రాజధానిని చూసి ఏ రాష్ట్రంలోనూ పెట్టుబడులు రావని, రాజధాని లేకుండానే దేశంలో అత్యధిక పెట్టుబడులను ఏపీ రాబట్టిందని సెలవిచ్చారు అమాత్యులు. పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని, దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీఎస్డీపీ (11.34 శాతం) అధికంగా ఉందని మంత్రివర్యులు చెప్పారు. రాజధాని చూసి కాదని, పరిపాలన చూసి పెట్టుబడులు పెడతారని సరికొత్త భాష్యం చెప్పారు చెన్నుబోయిన.
కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లినా ఏపీ మంచి వృద్ధి నమోదు చేసిందట. రాజధానికి, పెట్టుబడులకు ముడి పెట్టవద్దని సలహా ఇచ్చారు ఈ వైసీపీ నేత. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందని, రూ. 23,985 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.
దీంతో, చెల్లుబోయినపై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ మూడున్నరేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎంతో ఆయనకు తెలుసా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడుల సంగతి పక్కనబెడితే…జగన్ దెబ్బకు ఏపీ నుంచి అమరరాజా వంటి ఎన్నో కంపెనీలు తెలంగాణ, తమిళనాడుకు తరలివెళ్లిన సంగతిని మంత్రివర్యులు మరచినట్లున్నారని చురకలంటిస్తున్నారు.