వివాదాస్పద దర్శకులు పెనుమత్స రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఓ చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. దీంతో ఇప్పుడీ వివాదం పెరిగి పెద్దదయి కోర్టు దాకా పోనుంది. ఓ ఫైనాన్షియర్ ను మోసం చేసిన ఘటనకు సంబంధించి ఆయనపై భాగ్యనగరి, మియాపూర్ పీఎస్ పరిధిలో కేసు నమోదు అయింది. వీటిపై ఆర్జీవీ స్పందన ఏ విధంగా ఉంటుందో అన్నది ఇప్పుడిక ఆసక్తిదాయకం. వాస్తవానికి గతంలో కూడా ఆర్జీవీ పై ఫైనాన్స్ బేస్డ్ కేసులు బోలెడు ఉన్నాయి.
ఆర్జీవీని నమ్మి మోసపోయిన నిర్మాతలు కోర్టును ఆశ్రయించిన ఘటనలూ ఉన్నాయి. అయితే ఇవన్నీ తనకు చాలా చిన్న విషయాలు అని, తానేం చెప్పాలనుకుంటున్నానో అన్నది కోర్టు లోనే చెబుతానని గతంలో ఓ సారి ఓ సందర్భంలో ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ఇక తాజా కేసులో ఆయన ఓ స్నేహితుడి దగ్గర 56 లక్షల రూపాయల మేరకు అప్పు తీసుకుని, తరువాత తీర్చలేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేశామని పోలీసులు అంటున్నారు.
ఇక గతంలో చాలా గొడవలు ఉన్నాయి ఆర్జీవీకి. ఆయన తమను మోసం చేశారని ఇటీవల డేంజరస్ సినిమా సమయంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఇదే సందర్భంలో నిర్మాత నట్టి కుమార్ అనే వ్యక్తి తెరపైకి వచ్చి రామూను నోటికి వచ్చిన విధంగా తిట్టి వెళ్లాడు. ఆయన ఓ మోసగాడు అని, గతంలో తనతో సినిమా చేస్తానని చెప్పి మాట ఇచ్చి, కొంత డబ్బు కూడా తీసుకుని చీట్ చేశాడని, అందుకే తాను డేంజరస్ సినిమాను ఆపాలని అనుకుంటున్నానని మీడియా ముఖంగా చెప్పాడు. నట్టి కుమార్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో దాసరి శిష్యుడిగా పేరొందిన నిర్మాత. ఆ సినిమా సమయంలోనూ ఇలాంటి తగాదాలే వచ్చినా కూడా ఆర్జీవీ మాత్రం సిటీ కోర్టును ఆశ్రయించి, చిత్రం విడుదలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగించుకున్నారు.
ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగానే తనపై కేసు ఫైల్ చేశారని నట్టి కుమార్ పై అప్పట్లో ఆర్జీవీ ఆరోపణలు చేశారు. ఇక తాజా వివాదం 2019 లో తీసిన దిశ సినిమాకు సంబంధించి జరుగుతోంది. దీనిపై ఫైనాన్షియర్ .. ఆర్జీవీ తీరు తెన్నుల విశదీకరిస్తూ, ఆర్థిక సంబంధ ఆరోపణలు చేస్తున్నారు. ఇవి కూడా పోలీసు స్టేషన్ లో నమోదు అయి ఉన్నాయి. దిశ సినిమాకు సంబంధించి నిర్మాత తానేనని నమ్మబలికి తన దగ్గర వేర్వేరు సందర్భాల్లో డబ్బులు తీసుకున్నారని, ఆయన మాటలు విని నమ్మి మోసపోయానని ఆఖరికి ఆయన ఆ సినిమాకు నిర్మాత కాదని తెలిశాక న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నానని, ప్రస్తుతం తన డబ్బులు తనకు ఇప్పిస్తే చాలు అని పోలీసులను వేడుకుంటున్నాడు.