నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ సినీ ప్రముఖు డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజలతోపాటు పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపింది. ఆ తర్వాత హఠాత్తుగా అకున్ సబర్వాల్ బదిలీ కావడంతో గ్యాంగ్ స్టర్ నయీం కేసు తరహాలోనే ఆ కేసుక కూడా కోల్డ్ స్టోరేజిలోకి చేరింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ కొత్త కోణంలో మొదలైంది.
డ్రగ్స్ కేసులో భారీ మొత్తంలో నగదు విదేశాలకు బదిలీ అయిందని ఈడీ అధికారులకు పక్కా సమాచారం ఉండడంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ను ఈడీ దాదాపు 10 గంటల పాటు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఈడీ విచారణకు సినీ నటి, నిర్మాత ఛార్మి హాజరైంది. ఛార్మిని కూడా ఈడీ అధికారులు సుదీర్ఘ సమయం పాటు విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఛార్మి బ్యాంక్ అకౌంట్స్‌ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఖాతాలో ఛార్మి నగదు వేసిందా? ఆమె ప్రొడక్షన్ హౌజ్ పూరీ కనెక్ట్స్ ఆర్థిక లావాదేవీలపై కూడీ ఈడీ ఆరా తీయనుందట. కెల్విన్‌తో ఛార్మికి పరిచయం ఉందా ? కెల్విన్ అకౌంట్‌కు ఆమె మనీ ట్రాన్స్ఫర్ చేశారా? లేదా? అన్న కోణంలోనూ ఈడీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. పూరీ, ఛార్మి నిర్మాతలుగా పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై కొన్ని సినిమాలు నిర్మించడంతో వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
పూరీ బ్యాంకు స్టేట్ మెంట్ తో పాటు కెల్విన్ బ్యాంక్ స్టేట్ లను పరిశీలించిన ఈడీ అధికారులు…కెల్విన్ కు డబ్బు ఎందుకు పంపారో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కెల్విన్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసిన ఈడీ అధికారులు పూరీతోపాటు విచారణకు హాజరు కాబోయే సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరైన ఛార్మిపై కూడా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించబోతోంది. కెల్విన్ ఖాతాకు నగదు బదిలీ వంటి అంశాలపై విచారణ జరపనుందని తెలుస్తోంది.
2017లో ఈ డ్రగ్స్ కేసు బట్టబయలు కావడానికి డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కీలక సూత్రధారి. అయితే, ఆనాడు ఎక్సైజ్ అధికారుల విచారణలో కెల్విన్ కేవలం కొందరి పేర్లు చెప్పి సైలెంట్ అయిపోయాడు. దీంతో, ఆ కేసు పెద్దగా ముందుకు సాగలేదన్న వాదనలున్నాయి. అయితే, ఆరు నెలల క్రితం కెల్విన్ ను ఈడీ విచారణ జరపడంతో మరోసారి ఈ కేసు డొంక కదిలినట్లు తెలుస్తోంది. 6 నెలల గ్యాప్ లో దాదాపు 12 సార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు విచారణకు పిలిచి తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించడం, అతడి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కెల్విన్ ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఈడీకి కెల్విన్ అప్రూవర్ గా మారడని, కెల్విన్ ఇచ్చిన సమాచారంతోనే ఈ వ్యవహారంలో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చిందని తెలుస్తోంది. కెల్విన్ గుట్టు విప్పడంతోనే విదేశాలకు సినీ ప్రముఖుల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించిందని, అందుకే పూరీ విచారణలోనూ నగదు బదిలీపై, 2015 నుంచి పూరీ బ్యాంకు ఖాతాల వివరాలపై ఈడీ ఫోకస్ చేసిందని తెలుస్తోంది.