వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై హత్యారోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు మర్డర్ చేసిన వైనం రాజకీయ దుమారం రేపింది. అయితే, అనంతబాబను కాపాడేందుకు వైసీపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక, అనంతబాబు అరెస్టు వ్యవహారంలోనూ పోలీసులు మీనమేషాలు లెక్కించారని ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు, ఇప్పటివరకు అనంత బాబు కేసులో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేయకపోవడం పలు అనుమాలకు తావిచ్చింది. అనంతబాబును జగన్ అండ్ కో కాపాడుతున్నారనడానికి ఛార్జిషీట్ వ్యవహారం మరింత ఊతమిచ్చింది. వాస్తవానికి అరెస్ట్ అయిన 90 రోజులలోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ, అనంతబాబు వ్యవహారంలో ఈ 90 రోజుల డెడ్ లైన్ పూర్తి కావడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ ఈ రెండు రోజులలోపు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే అనంత బాబుకు స్వచ్ఛందంగా బెయిల్ సులువుగా లభిస్తుంది.
అయితే, అనంత బాబును కాపాడేందుకు వైసీపీ పెద్దలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితులలో తాజాగా అనంత బాబుపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రిలిమినరీ ఛార్జి షీట్ చేశామని ఎస్పీ రవీంద్రనాథ్ వెల్లడించారు. మరిన్ని వివరాలతో అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు.
ఇక తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంత బాబు దాఖలు చేసిన మూడో బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరిగింది. అయితే, ఈ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ లోపే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో అనంతబాబుకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇక, ఎట్టకేలకు టీడీపీ నేతల ఒత్తిడి, పోరాటం వల్లే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.