రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఓటమి భయంతో టిడిపి శ్రేణులపై టీడీపీ నేతలు, కార్యకర్తల వాహనాలు, ఆస్తులపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల తలలు పగలగొట్టటడం మొదలుకొని రాత్రి నరసరావుపేట నడిబొడ్డులో టిడిపి నేతకు చెందిన బొలెరో వాహనాన్ని తగలబెట్టడం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. టిడిపి నేతలు, కార్యకర్తలు, వారి వాహనాలు, ఆస్తులు లక్ష్యంగా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి.
ఈ నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తతలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అరాచక పాలనకు గుడ్ బై చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పేందుకు భారీగా జరిగిన పోలింగ్ శాతం నిదర్శనమన్నారు. ప్రజల్లో తిరుగుబాటు కళ్లెదుట కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.
మాచర్లలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన అనుచరులపై దాడి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి అరవిందబాబు, ఆయన అనుచరులపై దాడి, తాడిపత్రిలో అస్మిత్ రెడ్డిపై, గుంటూరు నగరంలో ఓ మహిళపై వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్య వాహనంతో దాడి, చీరాలలో టిడిపి అభ్యర్థి ఎం.కొండయ్యపై దాడి, తెనాలిలో ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని దాడి, శ్రీకాకుళం అభ్యర్థి గుండు శంకర్ పై పోలింగ్ బూత్ ఎదుటే దాడి, తిరువూరులో కేశినేని చిన్ని బృందంపై వైసీపీ నేత జోగి రమేష్ వీరంగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం ఖాయమని జోస్యం చెప్పారు.