టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోడుమూరులో చంద్రబాబు రోడ్ షోకు ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు సంచలన విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులతో జగన్ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత తమ పార్టీదేనని, ఈ మూడున్నరేళ్లలో వైసిపి ఏం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని, జగన్ చెత్త సీఎం అని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై పోలీసులతో కేసులు పెట్టించే జగన్ రెడ్డి ఆఖరికి వారి పొట్ట కూడా కొడుతున్నాడని, పోలీసులకు డిఏలు, పిఎఫ్ లు వస్తున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు.
తాను జగన్ ను నిలదీస్తే పోలీసులకు రావాల్సిన బకాయిలలో 18 కోట్లు విడుదల చేశారని, మళ్ళీ తాను అడిగితేనే డబ్బులు వస్తాయన్న విషయాన్ని పోలీసులు గ్రహించాలని చంద్రబాబు అన్నారు. ఏపీ సిఐడి ఓ పనికిమాలిన దద్దమ్మ శాఖలా మారిందని, ప్రభుత్వాన్ని నిలదీస్తే ముందుగా వీరు రంగంలోకి దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వీళ్ళకి చట్టం లేదంటున్నారని, తప్పు చేసిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
వారిని బోనెక్కించే బాధ్యత తనదని, జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారని, తనని నమ్ముకుంటే రాచబాటలో నడుస్తారని చంద్రబాబు చెప్పారు. కాకినాడలో ఓ ఎమ్మెల్సీ ఎగిరెగిరిపడ్డాడని, ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ జైల్లో ఉన్నాడని అనంత బాబుని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అతడికి బెయిల్ కూడా రాలేదని, జగన్ కూడా ఏమీ చేయలేడని అన్నారు. ఎగిరెగిరి పడే వారికి, వైసిపి నేతలకు ఖబర్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
రౌడీలను పరిగెత్తించిన పార్టీ టిడిపి అని, తాను తలుచుకుంటే ఈ రౌడీ రాజకీయాలు అణచడం నిమిషం పని అని అన్నారు. వడ్డీతో సహా వడ్డిస్తామని హెచ్చరించారు. తాను సభ నిర్వహించకుంటేనే ఇంతమంది వచ్చారని, సభ నిర్వహించి ఉంటే కోడుమూరు పట్టేది కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు టిడిపి గాలి వీస్తోందని, ఈ గాల్లో వైసిపి కొట్టుకుపోతుందని చంద్రబాబు అన్నారు.