ఏపీలో జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై జనం తమ నిరసనను బాహాటంగా వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మహిళలు గట్టిగా నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, టీడీపీకి ఆదరణ పెరుగుతోందని రాజకీయ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ ఆట ముగిసిందని, వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీకి ఏకపక్ష విజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ అసమర్థ, అధ్వాన్న పాలనతో జనం తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని విమర్శించారు.
మహానాడుకు పోటీగా వైసీపీ మంత్రుల బస్సు యాత్ర తుస్సుమందని ఎద్దేవా చేశారు. గడప గడపకు కార్యక్రమం విఫలమైందని, ఇక, బస్సు యాత్ర కూడా తేలిపోవడంతో అధికార పక్షం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సెటైర్లు వేశారు. గడప గడపకు వైసీపీ అని మొదట పేరు పెట్టారని, దానికి ఎవరూ రారని తెలుసుకున్న తర్వాత గడప గడపకు ప్రభుత్వం అని పేరు మార్చారని అన్నారు. వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, పోలీసులను వెంట పెట్టుకుని ఎమ్మెల్యేలు తిరుగుతున్న పరిస్థితి ఉందని పంచ్ లు వేశారు.
మూడేళ్ల అణిచివేతపై టీడీపీ కార్యకర్తల్లో ఏర్పడిన కసి, పాలకుల నిర్ణయాలతో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి, వ్యతిరేకత కలగలిసి మహానాడును అంచనాలకు మించి జయప్రదం చేశాయని చంద్రబాబు అన్నారు. డబ్బులు చెల్లిస్తామని చెప్పినా మహానాడుకు వాహనాలు ఇవ్వనివ్వలేదని మండిపడ్డారు. అధికారులతో బెదిరింపులకు దిగారని, అయినా టీడీపీ కార్యకర్తలు సొంతంగా ఆటోలు, బైకులు, ట్రాక్టర్లు, లారీలు.. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వచ్చి మహానాడును జయప్రదం చేశారని కొనియాడారు.
రాష్ట్రంలో మార్పు మొదలైందనడానికి మహానాడుకు పోటెత్తిన జన ప్రవాహమే సాక్షమని అన్నారు. మహానాడు విజయవంతం కావడానికి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు బాగా కృషి చేశారని, ఈ స్ఫూర్తిని, నమూనాను అన్ని జిల్లాల నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పోలీసులు, అధికారులు బెదిరించినా మండువవారిపాలెం గ్రామస్థులు తమ భూములను మహానాడు సమావేశాల నిర్వహణకు ఇచ్చి పట్టుదల చూపించారని మెచ్చుకున్నారు. మహానాడు సఫలమైందని ఇంట్లో కూర్చోకుండా మరింత పట్టుదలతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.
‘బాదుడే బాదుడు కార్యక్రమం ప్రతి ఊరిలో జరగాలి. పార్టీ సభ్యత్వ నమోదు కూడా వేగం పెంచాలి. గ్రామ స్థాయి వరకూ కమిటీల నియామకం త్వరితంగా పూర్తి చేయాలి. ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం పెంచాలి’ అని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపిచ్చారు. పార్టీలో కొన్నిచోట్ల వర్గ విభేదాలున్నాయని దివ్యవాణి ఉదంతాన్ని పరోక్షంగా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే, అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎంత పెద్దవారైనా ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు.