టీడీపీ నేతలకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతోనే అందరూ పనిచేయాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని సూచించారు. టీడీపీని గెలిపిస్తామన్న నమ్మకాన్ని నేతలే కల్పించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అభ్యర్థులు పనితీరే వారికి కొలమానం అని, లేదంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.
టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు ప్రోగ్రాం, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నేతలు వేగం పెంచాలని సూచించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు అందరూ విసిగివేసారిపోయారని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను టీడీపీ నేతలు పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.
వైసీపీ నమ్ముకున్న అసత్య ప్రచారపు ఎజెండాను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని అన్నారు. వైసీపీ నేతలను తిప్పికొట్టడంలో కొందరు నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అటువంటి నేతల లెక్కలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. 3 రాజధానుల మోసపూరిత ప్రకటనలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు టీడీపీ నేతలు నిలబడాలని పిలుపునిచ్చారు.
విశాఖలో వేల ఎకరాలను, వేల కోట్ల ఆస్తులను వైసీపీ గద్దలు చెరబడుతున్న వైనాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా… ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు.