స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మాత్రం పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2018 నుంచి కేసు విచారణ జరుగుతోందని, ఈ కేసులో చంద్రబాబుకు తప్ప మిగతా నిందితులందరికీ బెయిల్ వచ్చిందని వాదించారు. ఎన్నికలకు ముందు కేవలం కక్ష సాధింపుతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని, గత రెండు నెలల కాలంలో ఆయనపై మొత్తం 6 కేసులు పెట్టారని లూథ్రా కోర్టుకు వెల్లడించారు.
ఆడిట్ పూర్తిగా జరగలేదని సీమెన్స్ కంపెనీ స్వయంగా వెల్లడించిందని కోర్టుకు విన్నవించారు. అడ్వొకేట్ ఎథిక్స్ కు విరుద్ధంగా ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహరించారని, ఢిల్లీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలు వెల్లడించారని తెలిపారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు లూథ్రా.