మంగళవారం నుంచి గురువారం వరకు అంటే నాలుగు రోజులు చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన పెట్టుకున్నారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఇదే సందర్భంగా రోడ్డు షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించబోతున్నారు. మొత్తానికి నాలుగు రోజుల్లో ఆరు ప్రాజెక్టులను, నాలుగు రోడ్డు షోలు, రెండు బహిరంగసభలను చంద్రబాబు ప్లాన్ చేశారు. పేరుకు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనే అయినప్పటికీ ప్రస్తుతానికి కర్నూలు, కడప జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. తర్వాత చిత్తూరు, అనంతపురం జిల్లాల పర్యటన పెట్టుకున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులోని బనకచర్ల, ముచ్చుమర్రి ప్రాజెక్టులను సందర్శిస్తారు. తర్వాత నంది కొట్కూరులో రోడ్డుషో, బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని రిజర్వాయర్లను కూడా పరిశీలిస్తారు. బుధవారం సాయంత్రానికి కడప జిల్లాలోని జమ్మలమడుగు చేరుకుంటారు. కొండాపురం దగ్గరున్న గండికోట ప్రాజెక్టుతో పాటు పైడిపాలెం ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిధులను ఏ విధంగా విడుదల చేసింది, ప్రాజెక్టుపనులు ఎంత వేగంగా జరిగాయనే విషయాన్ని చంద్రబాబు ప్రత్యక్షంగా పరిశీలించబోతున్నారు.
నిజానికి రాయలసీమ ప్రాజెక్టుల కంపేరిజన్ రిపోర్టును చంద్రబాబు పార్టీ ఆపీసులోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆ ప్రజెంటేషన్నే ఇపుడు ప్రాక్టికల్ గా ప్రాజెక్టుల సందర్శన పేరుతో చూపించబోతున్నారు. టీడీపీ హయాంలో తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగిరి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు, జరిగిన పనులను చంద్రబాబు ఇప్పటికే వివరించున్నారు. అవే వివరాలను జనాలకు రోడ్డుషోలు, బహిరంగసభల్లో మరోసారి డైరెక్టుగా చెప్పబోతున్నారు.
గడచిన నాలుగున్నరేళ్ళుగా సాగునీటి ప్రాజెక్టులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని నిదులను కేటాయించింది ? పనులు ఎంతమేర జరిగింది ? జరగాల్సిన పనులేమిటనే విషయాలను పెద్దగా వివరించిందిలేదు. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనీల్ కుమార్ యాదవ్ అయినా ఇప్పటి మంత్రి అంబటి రాంబాబు అయినా కేవలం రాజకీయ ఆరోపణలు, విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. అంతేకానీ ప్రాజెక్టుల పరిశీలన, అద్యయనం, అయిన పనుల వివరాలను మీడియా ద్వారా జనాలకు వివరించటం లాంటి వాటిని పట్టించుకోవటంలేదు. అందుకనే జనాలకు ఇప్పటిప్రభుత్వంలో పనులు జరుగుతున్నది లేనిది కూడా తెలీటం లేదు.