2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు…యువతకు సంచలన పిలుపునిచ్చారు. 100 రోజుల పాటు యువత టీడీపీ విజయం కోసం పనిచేయాలని చంద్రబాబు అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని, కానీ బాబు అధికారంలోకి రావాలంటే యువత 100 రోజులు టార్గెట్ గా పెట్టుకొని పని చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ గ్రామాన తిరిగి ఫ్యాను రెక్కలు విరగగొట్టాలని, యువత భవిష్యత్తుకు తనది గ్యారెంటీ అని చంద్రబాబు భరోసానిచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కుప్పం కన్నా పులివెందులకే ముందు నీళ్లు ఇచ్చానని, కానీ జగన్ మాత్రం కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. భూకబ్జాలు, గ్రానైట్ అక్రమ ధందా, గుండాయిజం తో కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తాను 87% హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తే, మిగిలిన 13% పనులు జగన్ పూర్తి చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఇక, కుప్పంలో అంగన్వాడీల నిరసనకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.