ఏపీలో కొత్త జిల్లాల తంతును సీఎం జగన్ నేటి నుంచి లాంఛనంగా…కాదు కాదు లాంఛనప్రాయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ పార్టీలోని అసంతృప్త నేతలకూ, కాబోయే మాజీ మంత్రులకూ పదవుల పందేరం చేయడానికి 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన జగన్…తానేదో గొప్ప పని చేశానని ఫీల్ అవుతున్నారు. లోక్ సభ నియోజకవర్గం ప్రామాణికంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసిన జగన్…72 రెవెన్యూ డివిజన్లతో మరింతమందికి పదవులు కట్టబెట్టనున్నారు.
అయితే, తమ ప్రభుత్వం గొప్ప అని, 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని, రాజకీయ కోణంలో జగన్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయాన్ని తాము అధికారంలోకి రాగానే సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదముందని ప్రధాని మోడీకి ఉన్నతాధికారులు చెప్పడం రాష్ట్ర పరిస్థితికి, జగన్ పాలనకు నిదర్శనమని అన్నారు.
విద్యుత్ చార్జీల పెంపు, పన్నుల భారంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఇంటింటికి ప్రచారం చేస్తామని చంద్రబాబు చెప్పారు. కరెంటు ఎందుకు పోతోందో, కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయో సీఎం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసం ప్రజలపై తీవ్ర భారం మోపారని ఆయన ఆరోపించారు. అక్రమ మద్యం రవాణా ద్వారా జగన్ వేల కోట్లు అర్జిస్తున్నారని, ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నెం.2 మద్యం అమ్ముతున్నారని వెల్లడించారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగిస్తామన్నారు.
అమరావతిలో ఆల్రెడీ 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పూర్తి చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని, జగన్ కు ఓటేసి తప్పుచేశామన్న భావన ఇప్పుడు సొంత వర్గంలోనే ఉందని అన్నారు.