అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమలాపురంలో భారీ బహిరంగలో పాల్గొన్న చంద్రబాబు…జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో టీటీడీ ప్రతిష్ట మసకబారిందని మండిపడ్డారు. పరిపాలన అంటే దోచుకోవడం కాదని, సేవ చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడమే పరిపాలన అని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు చేతికర్రల వ్యవహఆరంపై చంద్రబాబు సెటైర్ వేశారు. తెలుగు ప్రజలతోపాటు భారత దేశంలోని మెజారిటీ ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి అని, అటువంటి తిరుమలలో పులుల బారిన పడకుండా ఉండేందుకు భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు.
ఇంటికో కర్ర మాదిరి మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నారరని చురకలంటించారు. భక్తులు కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడ్డానికి కాదు, తిరుమలలో పులులను చంపడానికి వెళుతున్నట్టుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుందంట అని ఎద్దేవా చేశారు. ఇది సరైన నిర్ణయమేనా… సమర్థ ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని ఈ వైసీపీ దొంగలను తరిమికొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతకుముందు, ‘అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక’ సదస్సులో వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, వివిధ రంగాల నిపుణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. డాక్యుమెంట్-2047లో తాను 5 ప్రతిపాదనలు పెట్టానని, వాటిలో ప్రధానమైనది సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్ అని అన్నారు. ఈ విధానం నిజంగా గేమ్ ఛేంజర్ అవతుందని, అమలాపురానికి అవసరమైన విద్యుత్ మొత్తాన్ని ఇక్కడే తయారుచేసుకోవచ్చని చెప్పారు. గ్లోబల్ థింకింగ్. కోవిడ్ వచ్చినప్పుడు ఇళ్లల్లో ఉండే పనులు చేశారని, రాబోయే రోజుల్లో ప్రతి ఊరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ సంపాదించుకునే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.