వివేకా మర్డర్ కేసు సినిమా థ్రిల్లర్ సినిమాలా మలుపుల మీద మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన సమయంలో ఆయన తల్లికి అనారోగ్యంపాలు కావడం, ఆ కారణంతో ఆయన విచారణకు గైర్హాజరు కావడం తెలిసిందే. అయితే, పట్టువదలని సీబీఐ అధికారులు వెంటనే అవినాష్ రెడ్డి కోసం పులివెందుల వెళ్లడం, ఆయన అక్కడ లేకపోవడంతో డ్రైవర్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమయ్యాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాల్సిందేనని
నోటీసులలో పేర్కొన్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని అందులో సూచించారు. అయితే, ఈ సారైనా ఆయన విచారణకు హాజరవుతారా లేక మరేదన్నా కారణం చెప్పి గైర్హాజరవుతారా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. బాబాయ్ కిల్లర్ అవినాశ్ రెడ్డి డ్రామాలపై ఓ సినిమాను తీయొచ్చని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయనను సీబీఐ కూడా పట్టుకోలేకపోతోందని చంద్రబాబు విమర్శించారు. అనకాపల్లి పర్యటన సందర్భంగా జరిగిన రోడ్ షోలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గూగుల్ కు దొరికిపోయినప్పటికీ అవినాష్ రెడ్డి ఇంకా అరెస్ట్ కాలేదని చంద్రబాబు అన్నారు.