మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు సంచలన విషయాలు వెల్లడించినట్టు ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యపై చంద్రబాబు స్పందించారు. వివేక హత్యానంతరం నారాసర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో వేసుకున్నారని, కానీ, ఈరోజు అసలు నిజం బట్టబయలైందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గూగుల్ టేక్ అవుట్ వంటి టెక్నాలజీ ఒకటి వస్తుందని, దానికి తగులుకుంటానని జగన్ ఊహించి ఉండడంటూ సెటైర్లు వేశారు.
గూగుల్ అంకుల్ ని అడిగితే చాలు ఏం జరిగిందో అన్న వివరాలన్నింటినీ మన ముందు ఉంచుతుంది అంటూ జగన్ కు చురకలంటించారు. ఎంపీ సీటు కోసమే వివేకా అడ్డు తొలగించుకున్నారని, కోడి కత్తి కమలహాసన్ థ్రిల్లర్ సినిమాకు తీసిపోని రీతిలో స్టోరీ రాశారని జగన్ ను ఎద్దేవా చేశారు. బాబాయ్ ని చంపిన విధానం, ఆడిన నాటకం అనూహ్యమని, సినీ కథా రచయితలకు కూడా ఈ స్క్రిప్ట్ అందదని సెటైర్లు వేశారు.
వీళ్లంతా ఆరోజు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారట…దస్తగిరి తదితరులతో గొడ్డలి తెప్పించారట…అంటూ ఆ కథనాన్ని చంద్రబాబు ఉటంకించారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లి హత్య చేసి మళ్లీ అవినాష్ రెడ్డి ఇంటికే వచ్చారట అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇక, ఆ తర్వాత గుండెపోటుతో రెండు లీటర్ల రక్తం కక్కుకొని బాత్రూంలోకి వెళ్లి వివేకా పడిపోయారని కట్టుకథ అల్లారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, కొందరు పోలీసులు జగన్ కు పావులుగా మారి ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. జగన్ చెప్పినట్టు నడుచుకొని కొందరు పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.