టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై పంచ్‌లు రువ్వారు. “రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డికి సరైన మొగుడిని పెట్టా. ఈ సారి తేలిపోతుంది.. గెలుపు ఎవరిదో“ అంటూ.. వ్యాఖ్యానించారు. రాయచోటి నియోజకవర్గం నుంచి ఈ సారి టీడీపీ తరఫున మండిప ల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మండిపల్లి భుజంపై చేయి వేసి మరీ చంద్రబాబు ప్రోత్సహించారు. రాంప్రసాద్ రెడ్డి అందరికీ తెలిసిన వాడని అన్నారు. అందుకే ఇక్కడ టికెట్ ఇచ్చామన్నారు.
“ఎవడో గడికోట శ్రీకాంత్ రెడ్డి అంట. ఎగిరెగిరి పడుతున్నాడు. కోట కట్టుకున్నాడంట. ఇప్పుడు ఇక్కడ సరైన మొగుడిని పెట్టా. ఇక, చూస్తా.. ఆటలు!“ అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపై చంద్రబాబు పంచ్‌లు రువ్వారు. నియోజకవర్గంలో ప్రతి పనికీ బొక్కాడం టూ.. అవినీతి ఆరోపణలు చేశారు. ప్రతి ఒక్కరినీ కాల్చుకు తింటున్నారని అన్నారు. రాయచోటిలో వరుసగా గెలిపించారు. కానీ, ఏమైనా అభివృద్ధి చేశాడా? అని ప్రశ్నించారు. “ఈయన(శ్రీకాంత్ రెడ్డి) సైకో జగ్లక్ రెడ్డికి తొత్తు. అక్కడ మీట నొక్కితే..ఇక్కడ పనిచేస్తాడు. లేక పోతే లేదు. భజన మాత్రం బాగా చేస్తాడు“ అని దుయ్యబట్టారు.
“రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. కానీ, ఇక్కడి ప్రజలు వ్యతిరేకించారు. అయినా.. పట్టించుకున్నాడా? ప్రజల సెగ భరించలేక హైదరాబాద్‌కు పోయి తలదాచుకున్నాడు. ఇలాంటి వాడా మీకు కావాల్సింది. రాంప్రసాద్‌రెడ్డి.. ఇక్కడే ఉంటాడు. మీ సమస్యలు పట్టించుకుని, వాటిని పరిష్కరిస్తాడు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో నీళ్లు లేకపోయినా..అడిగే ధైర్యం, దమ్ములేని చేతకాని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అని అన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. ఇలాంటి నాయకుడిని చిత్తుచిత్తుగా ఓడించి.. టీడీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి. మీ సమస్యలు నేను పరిష్కరిస్తా! అని చంద్రబాబు హామీ ఇచ్చారు.