తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన జిల్లాల యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట ఆయనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా తన సొంత జిల్లా చిత్తూరులోని నగరిలో పర్యటించిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. మంత్రి రోజా అడ్డాలో చంద్రబాబు చేపట్టిన రోడ్ షో ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. చంద్రబాబు రాకతో నగరిలోని ప్రధాన రహదారులు జన సందోహంతో నిండిపోవడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
నగరిలోని ఎన్టీఆర్ కూడలిలో బాదుడే బాదుడు కార్యక్రమంతోపాటు రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు….జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం జగన్ అందర్నీ వాడుకుని వదిలేశారని, బాబాయ్‌ను చంపిన జగన్.. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడని షాకింగ్ కామెంట్లు చేశారు. ఏం సాధించావని ప్లీనరీ పెట్టుకున్నావు జగన్ అని చంద్రబాబు నిలదీశారు.
పోలీసులను పెట్టుకుని తిరగడం కాదని, ప్రతిపక్ష నేతగా ముద్దులు పెడుతూ తిరిగినట్లు ఇప్పుడు తిరుగుచూద్దామని సవాల్ విసిరారు. అలా తిరిగితేనే జనాగ్రహం అంటే ఏమిటో జగన్‌కు అర్థమవుతుందని చురకలంటించారు. డ్రైనేజీ కాలువలు కూడా తవ్వలేని వ్యక్తి… 3 రాజధానులు కడతాడట, డ్యాములు నిర్మిస్తాడట అని ఎద్దేవా చేశారు. పెగాసస్ వాడానంటూ తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను కేసులకు భయపడనని స్పష్టం చేశారు. జగన్ మద్యంలో విషపదార్థాలున్నట్లు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని, జే బ్రాండ్‌పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ అరాచక పాలన పోవాలంటే తన పోరాటానికి ప్రజలంతా అండగా ఉండాలని, ఇంటికొకరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తే ఈ తుగ్లక్ సీఎం రద్దు చేశారని, నగరిలో కాలుష్య నివారణకు నానో టెక్నాలజీ తెస్తానని అన్నారు. ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు రద్దు చేశారని, తాను తెచ్చానన్న కోపంతో అనేక ప్రాజెక్టులు ఆపారని మండిపడ్డారు. పార్టీలో ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని, జగన్ నొక్కేవన్నీ ఉత్తుత్తి బటన్లేనని సెటైర్లు వేశారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షి.. ఇప్పుడు లాభాల బాటలో ఉందని, భారతి సిమెంట్ కోసం అన్ని సిమెంట్ కంపెనీలు ధరలు పెంచేలా చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ పాలన మొత్తం అవినీతిమయమని, ఈ ప్రభుత్వం నవ రత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.