బీఆర్ఎస్…. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఈ పార్టీ పేరు మార్మోగిపోతుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్. బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీపై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఫోకస్ ఉంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ పార్టీ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సతీసమేతంగా బెజవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో చంద్రబాబు కాసేపు మాట్లాడారు.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాలని విలేకరులు చంద్రబాబును కోరారు. అయితే, విలేకరుల ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులను అలా చూస్తూ నవ్వేసి చంద్రబాబు అక్కడినుంచి వెళ్ళిపోయారు. అయితే, చంద్రబాబు చిరునవ్వు వెనుక వేరే అర్థం దాగి ఉందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందో లేదో తెలియని ఇటువంటి పరిస్థితులలో జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ వెళ్లడం ఏమిటనన్న ధోరణిలో చంద్రబాబు నవ్వారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇంట గెలవకుండానే రచ్చ గెలిచేందుకు కేసీఆర్ వెళ్తున్నారన్న ఉద్దేశంతోనే తన పార్టీకి చెందిన మాజీ నేత అయిన కేసీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు ఇలా నవ్వారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా..బీఆర్ఎస్ పై చంద్రబాబు రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, విజయ దశమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.