సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన నేపథ్యంలో ఆ కేసులో టిడిపి నేత బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. బోండా ఉమను ఈ కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నానని అన్నారు. తప్పు చేసే అధికారులు బి కేర్ఫుల్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రజావ్యతిరేకత పెరుగుతుంటే అధికార పార్టీ కుట్రలను పెంచుతోందని ఆరోపించారు.
ఈ దాడి విషయంలో సింపతి డ్రామాలకు వైసీపీ తెరలేపిందని, హత్యాయత్నం అంటూ టిడిపిపై బురదజల్లుతోందని చంద్రబాబు అన్నారు. నిందితులంతా వడ్డెర కాలనీకి చెందిన యువకులని, వారిని అనుమానం పేరుతో పోలీసులు తీసుకువెళ్లారని ఆరోపించారు. టిడిపి ప్రోద్బలంతో దాడి జరిగిందని చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టిడిపి ముఖ్య నేతలను ఈ కేసులో ఇరికించాలని పన్నాగం పన్నుతున్నారని, బోండా ఉమను ఈ కేసులో ఇరికించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
మరోవైపు, శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే ఒంటిమిట్ట రామాలయంలో అభివృద్ధి, దాంతోపాటు విజయనగరంలోని రామ తీర్థ ఆలయంలో శ్రీరాముని విగ్రహం తల తొలగించిన ఘటన కూడా గుర్తుకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగాయని, రధాలు తగలబడ్డాయని, అర్చకులపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న సహా అనేక దేవాలయాల పవిత్రతను దెబ్బతీసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
ఏ ఒక్క ఘటనలోను నిందితులు అరెస్టు కాలేదని, హిందూ భక్తుల మనోభావాలు కాపాడేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలిపోట్లు అన్న రీతిలో దాదాపు 160 ఘటనలు జరిగాయని, అయినా అది సమస్య కాదన్నట్లుగా ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట మాదిరిగా రామతీర్థం దేవాలయం అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే హిందూ మత పరిరక్షణకు నడుం బిగిస్తామని, రామ రాజ్యం రాబోతోందని అన్నారు.