ఎన్డీఏతో టీడీపీ పొత్తు పెట్టుకోబోతోందని, త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున చంద్రబాబు ప్రచారం కూడా చేయబోతున్నారని పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని, 2014 తరహాలోనే మరోసారి ఈ కూటమి విజయం సాధిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందని జాతీయ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ తాము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు అన్నారు. ఆ కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూశామని, కాబట్టి, ఈ పొత్తు వార్తను ప్రచారంలోకి తెచ్చినవారే దానికి సమాధానం చెబితే బాగుంటుందని చంద్రబాబు మీడియాతో చెప్పారు. గతంలో పరిపాలన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టామని, పార్టీపై ఫోకస్ పెట్టలేదని, అందుకే చాలా నష్టపోయామని వాపోయారు.
రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే క్రమంలో వ్యక్తిగతంగా, పార్టీపరంగా, రాజకీయంగా చాలా నష్టపోయామని అన్నారు. విభజన వలన కలిగిన నష్టం కంటే ఈ మూడేళ్ళలో జగన్ విధ్వంసకర పాలన వల్ల జరిగిన నష్టమే చాలా ఎక్కువగా ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేస్తున్నారని, అవి పూర్తిగా నాశనమైతే వాటిని మళ్ళీ గాడిన పెట్టుకోవడానికే చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో తొలిసారిగా తామే సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నట్లు జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ, ఆనాడు ఎన్టీఆర్ హయాం నుంచే సంక్షేమ పధకాలను అమలుచేసిన సంగతి అందరికీ తెలుసని అన్నారు. తాము మళ్ళీ అధికారంలోకి రాగానే జగన్ వల్ల చిన్నాభిన్నమైన వ్యవస్థలన్నిటినీ గాడినపెట్టి, ఇంతకంటే మంచి సంక్షేమ పధకాలే అమలుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments 1