టీడీపీ అధినేత చంద్రబాబు కు సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ తప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. ఆ వ్యవహారంలో వాదనలు పూర్తయి ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు నిన్న వెల్లడించింది. అయితే, తాజాగా క్వాష్ పిటిషన్ పై తీర్పును నవంబరు 8వకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
అక్టోబర్ 21 నుంచి 29 వరకు సుప్రీం కోర్టుకు దసరా సెలవులు కావడం, ఈ కేసులో లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేసేందుకు ఈ రోజే ఆఖరు తేదీ కావడంతో తీర్పు తప్పకుండా వస్తుందని చంద్రబాబు, టీడీపీ నేతలు భావించారు. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో మాత్రం చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు రోజుకు 2 లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రేపటి నుంచి చంద్రబాబుకు 2 ములాఖత్ లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఒక ములాఖత్ కు అవకాశం ఇస్తున్నారని, కనీసం 3 సార్లు ఇవ్వాలని, ప్రతి సారి 45 నుంచి 50 నిమిషాల సమయం ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టును కోరారు.