ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ వ్యవహారంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు..తీర్పును రిజర్వ్ చేసింది. మరో రెండు రోజుల్లో..అంటే సెప్టెంబరు 21న క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశముంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఆ రోజే విచారణ జరగనుంది.
మరోవైపు, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. దాంతోపాటు, స్కిల్ స్కాం కేసులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను కూడా విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో 3 పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా పడింది.
అంతకుముందు, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే, ఏపీ సీఐడీ తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాడీవేడి వాదనలు వినిపించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ స్వీకరించడానికి ఇది సరైన సమయం కాదని, పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని రోహత్గి వాదనలు వినిపించారు. ఒక్కరోజు అక్రమంగా జైల్లో ఉన్నా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని రోమిలా థాపర్ కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు. పాత జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారని, నేరం జరిగిన సమయం కన్నా, దర్యాప్తు వేళ చట్టబద్ధత ముఖ్యమని అన్నారు.