ఇరు తెలుగు రాష్ట్రాలలో కొద్దిరోజులుగా అకాల వర్షాలు సామాన్య ప్రజలతో పాటు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. అనుకోని విధంగా మండువేసవిలో కురిసిన వర్షాలకు దెబ్బకు చాలా ప్రాంతాల్లో వరి, మిర్చి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో, ఈ నెల 4,5,6 తేదీలలో రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.
ఉభయగోదావరి జిల్లాలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతన్నలను వెంటనే, ఆదుకోవాలని వారికి నష్ట పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే, రైతులకు నష్ట పరిహారం ఇచ్చే విషయంలో ప్రతిపక్షం విధించిన డెడ్ లైన్ పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా దెబ్బతిన్న ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ‘రైతు పోరుబాట’ పేరుతో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించబోతున్నారు. ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు 11వ తేదీ సాయంత్రం ఉండవల్లి నుంచి తణుకుకు చంద్రబాబు బయలుదేరి వెళ్ళనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో దెబ్బతిన్న అగ్రికల్చర్, హార్టికల్చర్ పంటలకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు పోరుబాట పట్టనున్నారు.