రాష్ట్ర ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాశారు. ప్రజలు అధైర్యపడొద్దని, తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. జనం నుంచి ఎవ్వరూ తనను దూరం చేయలేరని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తన విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరపలేరని అన్నారు. న్యాయం గెలుస్తుందని, ఆలస్యమైనా అంతిమ విజయం ధర్మానిదేనని అన్నారు.
తనపై కుట్రపూరితంగా అవినీతి ముద్ర వేశారని, ఈ చీకట్లు తాత్కాలికమేనని అన్నారు. ఈ సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని అన్నారు. ఈ దసరాకు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించానని, అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారని చెప్పారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని, ప్రజలు అధైర్యపడొద్దని అన్నారు.