జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మరోవైపు, ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జూలై 21 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై అంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.
అందరు తమ పేరును చెక్ చేసుకోవాలని, ఓటు లేకుంటే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వైసీపీ తొలగిస్తోందని ఆరోపించారు. ఓటు మన బాధ్యత అని, ఓటుతోనే భద్రత అని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు పిలుపునిచ్చారు. #CheckyourvoteGetyourvote అనే హ్యాష్ ట్యాగ్ ను ఆయన ట్రెండ్ చేస్తున్నారు.
పార్లమెంటులో ఏపీ సమస్యలతోపాటు గాడి తప్పిన లా అండ్ ఆర్డర్, విధ్వంసక పాలనపై చర్చించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అక్రమ కేసులు, దళిత గిరిజనులు, బీసీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి సభలో మాట్లాడాలని అన్నారు. పోలవరాన్ని ప్రభుత్వం నాశనం చేసిన విధానాన్ని పార్లమెంట్ లో చర్చకు తేవాలని అన్నారు.
పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై సందర్భాలకనుగుణంగా పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 31 మంది ఎంపీలు ఉండి వైసీపీ సాధించింది ఏంటి? అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు జగన్ కేసుల లాబీయింగ్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై, ప్రాజెక్టులపై ఒక్క వైసీపీ ఎంపీీ కనీసం ఒక్క సారి కూడా కేంద్రానికి విన్నపం చేసిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు.