టీడీపీ అధినేత చంద్రబాబు కు విజన్ ఉన్న నాయకుడిగా పేరుంది. గతంలోనే ఆయన 2020 విజన్‌తో ముం దుకు సాగారు. అప్పుడంటే అధికారంలో ఉన్నారని, అందుకే విజన్ ప్రకటించారని పలువురు వ్యాఖ్యానిం చారు. అయితే.. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా తనపంథాను వీడడం లేదు. సరికదా.. మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ఒక లక్ష్యం ప్రకటించారు.
దేశంలోను, రాష్ట్రంలోను పుష్కలంగా ఉన్న యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి భారత్ చేరుతుందని చంద్రబాబు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత జాతీయ జండా ఆవిష్కరించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.. ‘విజన్-2047’తో ప్రణాళికాబద్ధంగా ప్రయాణం సాగించాలన్నారు.
విజన్ 2047 లక్ష్యం.. పేదరికం, అసమానతలు లేని సమాజం సాధించడమేనని చంద్రబాబు తెలిపారు. ఏపీలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్ర స్ఫూర్తితో పోరాడుదామన్నారు. వైసీపీ విధ్వంస పాలనతో ఏపీని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఏపీలో రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ యువ నాయకుడు చేపట్టిన యువగళం కూడా విజన్ 2047 లక్ష్య సాధనగానే ముందుకు సాగుతుందన్నారు.
యువతలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలిపి.. రాష్ట్రానికి, దేశానికి దానిని సద్వినియోగం చేయాలనే ద్రుఢ సంకల్పం ఉందని చెప్పారు. ప్రతి విషయాన్నీ.. వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. పాదయాత్రలు చేసుకునేందుకు గతంలో తమ ప్రభుత్వం అనుమతించకపోయి ఉంటే.. వైఎస్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. షర్మిల, జగన్‌ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తానంటే.. ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. మొత్తానికి చంద్రబాబు తాజా విజన్‌పై ప్రజాస్వామ్య వాదులు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.