వరదల కారణంగా సర్వం, సకలం కోల్పోయిన వారిని ఆదుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా వరదనీటిలోనూ హెరిటేజ్ సంస్థ తరఫున బాధిత వర్గాలకు తన వంతు సాయం చేస్తోంది. ఇవే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, లేని వారు కూడా గ్రామాల్లోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాధిత వర్గాలకు భరోసా ఇస్తూ, గ్రామాల్లోనే ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంకా మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా కదలి రావాలని బాబు పిలుపునిస్తున్నారు. కొన్ని చోట్ల సహాయక చర్యలు నిలిచిపోయాయి అని కోపం అవుతున్నారాయన. ప్రభుత్వ అవగాహనా రాహిత్యం, అధికారుల అలసత్వం కారణంగా ఈ విధంగా దయనీయ స్థితిగతులు నెలకొన్నాయని మండిపడుతున్నారు. చెరువుల ఆక్రమణలు తొలగిస్తే కొంత మేరకు సమస్య పరిష్కారం అయ్యేదని కూడా అక్కడి స్థానికులు చెబుతున్నారు.
దీంతో, నేరుగా ఈ సారి అధికారులతో అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ బాస్ సిద్ధం అవుతున్నారు. కోనసీమ పర్యటనకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. తన పరిధిలో బాధిత వర్గాలను కలవడంతో పాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను పార్టీ తరఫున అసెంబ్లీ వేదికగా వినిపించేందుకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు బాబు. ఈ క్రమంలోనే జూలై 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు ప్రాంతాలలోనూ… జూలై 22న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట ప్రాంతాలలోనూ పర్యటిస్తానని ప్రకటించారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల బాధలు పట్టించుకుని వాటిపై పోరాడేందుకు తాము ఎన్నడూ సిద్ధమేనని చంద్రబాబు అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీతో పాటు జనసేన కూడా వరద సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వీలున్నంత మేరకు బాధిత వర్గాలకు ఆహారం అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Comments 1