టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఆరోపణల నేపథ్యంలో జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును రిమాండ్లో ఉంచారు. అయితే, చంద్రబాబు హోదా, వయసు, జెడ్ ప్లస్ కేటగిరి భద్రత నా చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు, చంద్రబాబుకు జైలులో తగినంత భద్రత ఉండకపోవచ్చని, ఆయనకు ఎన్ ఎస్ జి కమాండోల భద్రత ఉందని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు వాదనలు వినిపించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబును హౌస్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తికు విజ్ఞప్తి చేశారు. అయితే భద్రత రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైలు కన్నా మరోచోటు సేఫ్ కాదని ప్రభుత్వం, సిఐడి తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నలూరు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసి రేపటికి వాయిదా వేశారు.
మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిఐడి ఆఫీసులో ఉన్నాయని, వాటిని పరిశీలించేందుకు అనుమతి కావాలని సి ఆర్ పి సి 207 కింద లూథ్రా మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఆ వెంటనే పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ సమయంలో లూథ్రాపై న్యాయమూర్తి కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆర్డర్ ఇచ్చే సమయంలో పిటిషన్ దాఖలు చేసి వెంటనే విచారణ చేయాలని అడగడం సరికాదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు హౌస్ రిమాండ్ విధిస్తారా లేదా అన్న వ్యవహారంపై ఉత్కంఠ వీడలేదు.