స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ ప్రకారం చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థఆనం సానుకూలంగా స్పందించింది. అంతేకాదు, వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది.
దసరా సెలవల నేపథ్యంలో విచారణ వెకేషన్ బెంచ్ లో కొనసాగనుంది. ఈ కేసులోని ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని, 40 రోజులుగా చంద్రబాబుపై విచారణలో పురోగతి లేదని లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
మరోవైపు, చంద్రబాబుతో న్యాయవాదుల లీగల్ ములాఖత్‌ను జైలు అధికారులు 2 నుంచి ఒకటికి కుదించిన సంగతి తెలిసిందే. దీంతో, ములాఖత్‌లు పెంచాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో, ఈ అంశంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని జడ్జి తెలిపారు.