వ్యక్తుల కంటే దేశమే మిన్న అని చెప్పారు నిన్నటి వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అవినీతి ఉన్నచోట అభివృద్ధి అన్నది సాధ్యం కాదు అని కూడా చెప్పారు. ఈ 2 మాటలూ చాలా బాగున్నాయి. అవును ! ఇప్పుడంతా జగనన్న ప్రభుత్వం అన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు బదులు జగనన్న ప్రభుత్వం అన్న పేరే వినిపిస్తోంది.
ఆ విధంగా ఆయన తన పేరును నిన్నటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ పదే పదే వినిపింపజేసుకున్నారని, శకటాల ప్రదర్శన సందర్భంలోనూ ఇదే విధంగా వాయిస్ ఓవర్ వచ్చే విధంగా చేసుకున్నారు అని ప్రధానంగా చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు పవన్ కూడా ఇదే మాట చెబుతున్నారు. దేశం కన్నా మనం గొప్ప కాదు అని.. కానీ ఆ మార్పు సంస్థాగతంగా ఎక్కడా వైఎస్సార్ నాయక శ్రేణుల్లో కానీ ప్రభుత్వంను నడుపుతున్న వ్యక్తుల్లో కానీ వీసమెత్తు కూడా కనిపించడం లేదన్నది విపక్షాల వాదన.
ముఖ్యంగా చంద్రబాబు చెప్పిన మాటల ప్రకారం అవినీతి లేని చోట అభివృద్ధి సాధ్యం అన్నది స్పష్టం అవుతున్న విషయం. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంస్థాగతంగా ఉన్నటువంటి అవినీతిపై ఇప్పటి ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది. ఏ మేరకు అభివృద్ధి అనే అంశానికి కట్టుబడి ఉంటుంది. ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలు పంచి పెడుతూ వస్తున్న ప్రభుత్వం పోనీ ఆ సంక్షేమాన్ని అయినా సక్రమంగా చేయగలుగుతుందా అన్నది విపక్ష నేత ప్రశ్న.
ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా అత్యవసర నిధులు సైతం వాడుకుని సంక్షేమ పథకాలకే నిధులు ఇస్తున్న వైనం ఇప్పటి ప్రభుత్వంలో ఉంది. మైనింగ్ , ఇసుక, గ్రానైట్ సంబంధిత వ్యవహారాలు అన్నీ అధికార పార్టీ నాయకులకి కాసుల వాన కురిపిస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ ఈ ఆరోపణలు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకునేవారే తప్పులు చేస్తుంటే ఇంకెవరు పట్టించుకుంటారు అని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.