టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర బాబు నాయుడుకు వయసైపోయింది….2024 ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 73 ఏళ్లు…ఆ వయసులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించడం, పాలనా వ్యవహారాలు చూసుకోవడం చాలా కష్టం…అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబుకు వయసైపోయిందంటూ విమర్శించే వారి నోళ్లను తెలుగు తమ్ముళ్లు ఎప్పటికప్పుడు మూయిస్తుంటారు.
ఇప్పటికీ నవయువకుడిలా నడుస్తూ ఫుల్ ఎనర్జీతో ఉండే చంద్రబాబుతో సమానంగా తిరుపతి మెట్లు ఎక్కే దమ్ము, చంద్రబాబులా విజన్ తో ఆలోచించగలిగిన రాజకీయ చాణక్య నీతి ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారా? అని సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 2024 నాటికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారి వయసులతో చంద్రబాబు వయసును పోలుస్తూ లెక్కలతో సహా వెల్లడించారు. దేశ ప్రధాని మోడీ సైతం 2024 నాటికి 73వ పడిలోకి వస్తారని, చంద్రబాబు కూడా 73వ పడిలో ఉంటారని గుర్తు చేశారు.
ఆ మాటకొస్తే యువనేత, నవతరంగం, నవలా నాయకుడు అని వైసీపీ నేతలు పిలుచుకునే సీఎం జగన్ కూడా 2024 నాటికి 52వ పడిలోకి వచ్చేస్తారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటువంటి విమర్శకులందరి నోళ్లను తాజాగా చంద్రబాబు ఫిట్ నెస్ మూతపడేలా చేసింది. పంట కాలువను అవలీలగా చంద్రబాబు దాటులున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దాదాపు మూడు అడుగుల అంగ వేసి మరీ చంద్రబాబు 27 ఏళ్ల యువకుడిలా గట్టు దాటడం చూసి పక్కనున్న సెక్యూరిటీ సిబ్బంది సైతం నోరెళ్లబెట్టారు. ఇక, ‘నా వయసు 72 , కానీ నా స్ఫూర్తి 27’ అని చంద్రబాబు ఆ ఫొటోను ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడే కాదు, గతంలో ముఖ్యమంత్రి హోదాలో న్యూయార్క్ లో జరిగిన `వరల్డ్ ఎకనమిక్ ఫోరం`, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సదస్సుకు చంద్రబాబు కాలినడకన హాజరైన వైనం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
68 ఏళ్ల వయసులోనూ 28 ఏళ్ల యువకుడిలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి…జోరువానలో కాలినడక కిలోమీటరు దూరం నడిచిన తీరు చూసి న్యూయార్క్ వాసులు ఆశ్చర్యపోయారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం నడిచొచ్చే నర్తన శౌరి అంటూ అప్పట్లో చంద్రబాబును ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా కీర్తించారు.