టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి రెడీ అయ్యారు. ఇప్పటికే మూడు పార్టీలు(బీజేపీ, టీడీపీ, జనసే న)లు తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి. ఇక, టీడీపీలో ఐదు స్థానాలకు మాత్రమే ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడంతో ప్రచార పర్వానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ నెల 27 నుంచి ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ‘ప్రజాగళం’ పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళిక సిద్ధమైందని పార్టీ వర్గాలు చెప్పాయి.
దీనికి సంబంధించి తొలి దశ ప్రచార షెడ్యూల్ను చంద్రబాబు ఖరారు చేసుకున్నారు. ఈ నెల 27 నుంచి 31 వ తేదీ వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. తొలి దశలో రాయలసీమపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ నెల 27న ఉమ్మడి చిత్తూరులోని పలమనేరు, నగరిలో పర్యటిస్తారు. తర్వాత.. నెల్లూరు రూరల్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ నెల 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేపడతారు. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో… ఈ నెల 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.