విజన్ ఉన్న నాయకుడిగా పేరొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాబోయే 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయత్నం.. ముఖ్యంగా ప్రజారోగ్యానికి గొడుగు పట్టిన ప్రయత్నం.. డీఎన్ ఏ డేటా సేకరణ. మొత్తం రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల డీఎన్ ఏను సేకరించడం ద్వారా.. వైద్య విధానాన్ని మరింత మెరుగు పరచాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలోనే `బ్లాక్ చైన్` విధానాన్ని అమలు చేయాలని తపించారు.
అప్పట్లలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. డేటా ఉల్లంఘలనకు పాల్పడుతున్నాయనే పెద్ద చర్చ సాగింది. అయితే.. అదేసమయంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త, సంచలన నిర్ణయం తీసుకుంది. అదే.. డీఎన్ ఏ డేటా సేకరణ! దేశంలో ఎనిమిదో పెద్దరాష్ట్రంగా ఉన్న ఏపీ 2018, మార్చి 28న ఒక ప్రకటన చేసింది. అదేంటంటే.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది బ్లాక్‌చైన్ ఆధారిత ప్రజల డీఎన్ ఏ డేటాను సేకరించేందుకు ఒక ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకుంటుంటున్నట్టు తెలిపింది.
ఈ కార్యక్రమానికి భాగస్వామిగా జర్మనీకి చెందిన జీనోమిక్స్ అండ్ ప్రిసిషన్ మెడిసిన్ కంపెనీ శివం వ్యవహరించనుందని తెలిపింది. ఈ డేటా సేకరణలో ఏపీ ప్రభుత్వం అధునాతన సాంకేతిక వ్యవస్థను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భాగస్వామ్య కంపెనీ శివం.. విశాఖపట్నంలోని ఫిన్‌టెక్ వ్యాలీలో ఒక అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అదేసమయంలో తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్‌తో కలిసి.. సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్ పైనా పనిచేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర పౌరులను టెస్ట్ చేయాలని కూడా నిర్ణయించినట్టు అయితే.. ఇది ఐచ్ఛికమేనని అధికారులు తెలిపారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే….
పూర్తిస్థాయి డీఎన్ ఏ రీతులను అధ్యయనం చేసేందుకు జీనోం సీక్వెన్సింగ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఈ అధ్యయనం.. వివిధ వ్యాధులకు సంబంధించి.. జీన్స్ వేరియేషన్స్‌ను తెలుసుకునేందుకు, వ్యాధులకు దీనితో ఉన్న లింకును తెలుసుకునేందుకు ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.
” ప్రపంచంలో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ, ఇది పరిశోధకులకు అందుబాటులో ఉన్న జన్యు సంబంధమైన డేటాలో ఇంకా లేదు” అని శివం సహ వ్యవస్థాపకుడు, CEO ఆక్సెల్ షూమేకర్ క్వార్ట్జ్‌కు చెప్పారు. “ఇది అనేక విషయాలు తెలుసుకునేందుకు దారితీస్తుంది” మైనారిటీ, తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సమూహాల వైద్య రీతులు, వారి వ్యాధుల పురోగతి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. జాతి లేదా భౌగోళిక ప్రదేశంలో ఉన్న వైవిధ్యం డేటాలో ప్రాతినిధ్యం వహించదని ఆయన అన్నారు.
భూములకు సంబంధించిన వివరాలను ఏ విధంగా అయితే.. డిజిటైజ్ చేస్తున్నారో.. అదేవిధంగా.. డీఎన్ ఏ వివరాలను కూడా నమోదు చేయడం ద్వారా.. ఏపీ ప్రభుత్వం సమూల మార్పులకు దోహదపడుతోందని అధికారులు పేర్కొన్నారు. ఒక క్లౌడ్‌లో రా జీనోమ్ డేటాను నిక్షిప్తం చేస్తారు. ఇది.. భారత్‌లోనే తొలి ప్రయత్నంగా నిలుస్తుందని అంటున్నారు పరిశోధకులు.
సాధ్యమేనా?
నిజానికి భారత్ వంటి విభిన్న ఆలోచనలు ఉన్న దేశంలో.. ఇప్పటికే ఫేస్బుక్లో వివరాలు కోరినందుకు, ఆధార్‌లో వివరాలు అడిగినమోదు చేస్తున్నందుకు.. అనేక ఉద్యమాలు తెరమీదికి వచ్చాయి. గోప్యత హక్కుకు భంగం కలుగుతోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. ఏపీ సర్కారు.. పౌరుల జన్యు సంబంధిత సమాచారాన్ని కోరడం, ఒక చోట నిక్షిప్తం చేయడం అనేది సాహసమే అంటున్నారు పరిశీలకులు. అయితే.. ప్రభుత్వం మాత్రం.. దీని వల్ల పౌరులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అత్యంత కపడ్బందీగా:
జీనోమ్ డేటాను అత్యంత పకడ్బందీగా నిక్షిప్తం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇది అత్యంత అవసరమని.. పౌరుల ఆరోగ్య సమస్యలపై మున్ముందు పటిష్టమైన వైద్యం అందించేందుకు వారి జీనోమ్ వివరాలు ఉపకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఐటీ సలహా దారు జేఏ చౌదరి పేర్కొన్నారు.