స్కిల్ డెవల్మెంట్ స్కామ్ లో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణ కోసం చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, తనకు బెయిల్, మధ్యంతర బెయిల్ కావాలంటూ చంద్రబాబు కూడా పిటిషన్లు వేశారు. తాజాగా ఆ పిటిషన్లపై నేడు విచారణ జరిపిని ఏసీబీ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 11 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.
సీఐడీ తరఫు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా…చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏ మాత్రం నిబంధనలు పాటించలేదని, ఆధారాలు లేకుండానే సీఐడీ అధికారులు కస్టడీ కోరుతున్నారని లూథ్రా గట్టిగా వాదించారు. సీఐడీ కస్టడీ అవసరం లేదని, ఎన్నికలకు ముందు చంద్రబాబుపై కక్షపూరితంగా కేసు పెట్టారని అన్నారు. నాలుగేళ్లుగా ఎవరిని అరెస్ట్ చేసినా నిధుల దుర్వినియోగం అనే మాట వినిపిస్తోందని వాదించారు.
అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను కూడా కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా రేపే విచారణ జరగనుంది. దీంతో, రేపు కోర్టులో విచారణలు, తీర్పుపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.