టీడీపీ అధినేత చంద్రబాబు కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబును విచారణ జరిపేందుకు మరో 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ రెండు పిటిషన్ల విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఒకేసారి ఈ రెండు పిటిషన్లపై రేపు వాదనలు వింటామని, ఒకేసారి ఆదేశాలు ఇస్తామని జడ్జి వెల్లడించారు.
కస్టడీ పిటిషన్ పై విచారణ కోసం సిఐడి తరఫు న్యాయవాదులు, బెయిల్ పిటిషన్ పై విచారణ కోసం చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోటీపడ్డారు. దీంతో, ఇరు వర్గాల తరఫు లాయర్లపై జడ్జి కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఏ పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరపాలో కోర్టుకు చెబుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇరువర్గాల లాయర్ల మధ్య చర్చ ముగిసేలా లేకపోవడంతో విచారణను రేపటికి వాయిదా వేశారు. ఏ పిటిషన్ పై ముందు విచారణ జరపాలో రేపు నిర్ణయిస్తామని, రెండు పిటిషన్లపై ఒకేసారి ఆదేశాలు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.