టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై వాదోపవాదాలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి తీర్పును ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉంది. అయితే, ఆ తీర్పుపై మరింత సమయం తీసుకున్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తానని చెప్పింది. అయితే, తాజాగా మరోసారి తీర్పును కోర్టు వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
క్వాష్ పిటిషన్ పై తీర్పు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున కస్టడీ పిటిషన్ పై సందిగ్ధత ఉందని తెలుస్తోంది. అయితే, క్వాష్ పిటిషన్ కు, కస్టడీ పిటిషన్ కు సంబంధం లేదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 26వ తేదీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో కూడా చంద్రబాబు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది.
ఈ రోజు అంగళ్లు కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో 79 మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. వారంతా ప్రతి మంగళవారం పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. దాంతోపాటు తనకు బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా ఈ రోజే తీర్పు వచ్చే అవకాశం ఉంది.