గతానికి భిన్నంగా బాబు , టీడీపీలో ఉప్పొంగిన ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాదు.. మరింత స్పష్టత కూడా కనిపి స్తోంది. మరి దీనికి కారణం.. పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే ధీమానే అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన అనేది టీడీపీకి పెద్ద టాస్క్. ఎవరిని ఎంపిక చేయాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే విషయాలపై పెద్ద ఎత్తున కసరత్తు చేయడం.. షెడ్యుల్‌కు ఒకటి రెండు రోజుల ముందు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.
ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో ఒకటి రెండు సార్లు మాత్రమే తొలి జాబితా షెడ్యూల్ కంటే 15 రోజుల ముందు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ అలా వచ్చింది లేదు. అయితే.. మళ్లీ ఇప్పుడు టీడీపీ తొలి జాబితా షెడ్యూ ల్కు 25 రోజులకుపైగా ముందే విడుదలైంది. 94 మందితో చంద్రబాబు ఈ తొలి జాబితాను విడుదల చేశారు. ఇక, తాజాగా 34 మందితో రెండో జాబితాను కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్న రెండు మూడు రోజులకు ముందుగానే ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం టీడీపీ.. బీజేపీ, జనసేనలతో కలిసి ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టీడీపీకి 144 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. జనసేనకు 21, బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు. ఇక, పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 25కి టీడీపీ 17, బీజేపీ 6, జనసేనకు 2 దక్కాయి. అయితే.. టీడీపీకి దక్కిన 144 అసెంబ్లీ సీట్లలో ఇప్పటి వరకు 128 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలినవి 16 మాత్రమే. మొత్తంగా చూస్తే ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించకుండానే చంద్రబాబు ఇన్ని సీట్లను ఖరారు చేయడం గమనార్హం.
ఇక, ఇలా చంద్రబాబు ఉప్పొంగిన ఉత్సాహంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనుక ప్రధా నంగా తాము గెలుస్తున్నామన్న ధీమా ఒకటి ఉంటే.. రెండో వైసీపీకి దీటుగా తమ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు అంచనా వేసుకుని ఉంటారని అంటు న్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికల సమయంలోనూ ముందుగా అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. మరి చంద్రబాబు వ్యూహానికి అనుకూలంగా తమ్ముళ్లు ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిస్తేనే బెటర్!!