వైఎస్ వివేకానందరెడ్డి ఎవరు? స్వయాన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్. దివంగత మహానేత సోదరుడు. అలాంటి ఆయన్ను ఆయన ఊళ్లో.. ఆయన ఇంట్లో అతి దారుణంగా చంపేయటానికి మించిన దారుణం ఏముంటుంది? మరి.. ఇంతటి సంచలన ఉదంతంలో.. జగనే రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు.. నిందితుల్లో ఏ ఒక్కరిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవటం ఏమిటి? అన్న సూటి ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. తన తండ్రి హత్యపై సాగుతున్న విచారణపై వివేక కుమార్తె ఢిల్లీలో ప్రెస్ మీట్ ఆవేదన వ్యక్తం చేయటం తెలిసిందే.
ఈ వ్యవహారం సంచలనంగామారటం.. కొన్ని మీడియా సంస్థల్లో ఆ వార్తకు ఇచ్చిన వాదనపై విజయమ్మ స్పందించటం తెలిసిందే. తాజాగా ఆమె రాసిన బహిరంగ లేఖలో కొన్ని మీడియా సంస్థల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పుడు.. వివేక హత్యపై సీఎం జగన్మోహన్ రెడ్డి.. తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ఏమిటన్నది స్పష్టం చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ.. జగన్ అండ్ కో ఈ ఉదంతం మీద పెద్దగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హంతకుల్ని కాపాడే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదన్న ఆయన.. వివేకా హత్య కేసులో నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. నిజానికి.. ఇలాంటి వ్యాఖ్యలు రావాల్సింది సీఎం జగన్ నోటి నుంచి కదా? అందుకు భిన్నంగా.. వివేక హత్య కేసు నుంచి ఆయన మౌనంగా ఉండటం ఏమిటి? చంద్రబాబు అంతలా రియాక్టు కావటం ఏమిటి జగన్మోహనా? అన్నది ప్రశ్నగా మారింది.