టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. ఏపీ అధికారులకు నేనంటే ఇష్టం పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. “వీళ్లంతా ఎవరు? నేను నియమించిన వాళ్లు. కానీ, ఈ రోజు నేనంటే ఇష్టం లేదు. నేను వస్తుంటే వద్దంటారు. అడ్డంకులు సృష్టిస్తారు. నేనే పట్టుబట్టి వచ్చాను. కానీ, వీళ్లకు ఇష్టం లేదు. పరిస్థితిని అలా మార్చేశారు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజాగా సోమవారం రాత్రి వేళలో పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొచ్చే సత్తా తమకు మాత్రమే ఉందని చెప్పారు. తనను అడ్డుకుంటే ప్రభుత్వంపై జనం తిరగబడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇటీవల పుంగనూరులో ఇదే జరిగిందన్నారు. అందుకే తన పోలవరం పర్యటనకు వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించలేదని తెలిపారు.
‘‘అధికారులకు కూడా నన్ను ప్రాజెక్టు అంతా తిరగనివ్వడం గానీ, తీసుకువెళ్లడంగానీ ఇష్టం లేదు. అయినా నేనే మొండిగా అన్ని ప్రాంతాల్లో తిరిగొచ్చాను. కానీ, ఇప్పుడు పనిచేస్తున్న పోలీసులు కానీ, ఇతర విభాగాల అధికారులు కానీ.. నా హయంలోనే నియమితులయ్యారు“ అని చంద్రబాబు అన్నారు. జగన్ చేస్తున్న క్రైమ్స్ లో పార్ట్ నర్స్ గా ఉండొద్దని, పోలీసులకు చేతులెత్తి దండం పెడుతున్నా అని చంద్రబాబు అన్నారు. “డిసెంబరులోపు పోలవరం పనులు చేసే అవకాశమే లేదు. ఆ తర్వాత వైసీపీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రజా ప్రభుత్వం వస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు మేమే పూర్వ వైభవం తీసుకొస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు నిర్వేదం
పోలవరం పర్యటనలో చంద్రబాబు తీవ్ర నిర్వేదం వ్యక్తం చేశారు. “నేను ఇప్పుడు నిమిత్తం మాత్రుడిని“ అని వ్యాఖ్యానించారు. “పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు, కోర్టు గొడవలు, వివాదాలు, సమస్యల్ని తొలగించి… ఐదేళ్లు కష్టపడ్డాం. ఇప్పుడు పోలవరాన్ని ఇలా చూస్తుంటే బాధ, ఆవేదన, ఒక్కోసారి నిస్సహాయత కలుగుతున్నాయి. ఇక్కడ పట్టుమని పది మంది ఇంజనీర్లు, కూలీలు కూడా పనిచేయట్లేదు. ప్రాజెక్టు ఎత్తు ఎందుకు తగ్గించాలని అడిగితే నంగనాచి కబుర్లు చెబుతున్నారు. కానీ, నేను ఇప్పుడు.. ఇప్పుడు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను“ అని అన్నారు.