ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలోని అవకతవకలపై సీఎం చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సందర్భంగా ఆర్థిక శాఖపై చంద్రబాబు సభలో శ్వేతపత్రం విడుదల చేశారు. విభజన సమయం నాటికి ఏపీకి పన్నుల రూపంలో 46 శాతం ఆదాయం అందిందని అన్నారు. ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయని, షెడ్యూల్ 9, 10లోని అంశాలు పరిష్కరించుకోలేకపోయామని చెప్పారు.
2014లో ఉమ్మడి ఏపీ తలసరి ఆదాయం రూ.95 వేలు అని, విభజన తర్వాత రూ.93,903 అని, అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కి పెరిగిందని గుర్తు చేశారు. 2014లో ఏపీలో వ్యవసాయం 33 శాతం, తెలంగాణలో 19 శాతం ఉండేదని అన్నారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి వంటిదని, పోలవరం పూర్తి చేస్తే ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందుతుందని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం చేకూరిందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు వ్యతిరేక విధానం అవలంబించారని, కేటాయించిన 227 ఎకరాలను భూములను ఉపసంహరించుకుని, పరిశ్రమలను తరిమేశారని గుర్తు చేశారు. ఈ రోజుకు రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అని, ఇంకా కొన్ని లెక్కలు రావాల్సి ఉందని, తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టు అప్పులు బయటికొస్తున్నాయని విమర్శించారు. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336 పెరిగిందని, ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. డీబీటీ అన్నారు… ఎక్కడికి కొట్టుకుపోయింది? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు.