జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో జరిగిన ‘రా కదలిరా’ సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ ను ఏకిపారేశారు. జగన్ అర్జునుడు కాదని అక్రమార్జనుడు అని విమర్శించారు. రేపు ఎన్నికల్లో జగన్ ను ప్రజలు గద్దె దించడం ఖాయమని, కానీ నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వాళ్ల జీవితాలను జగన్ నాశనం చేశాడని దుయ్యబట్టారు. 12 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. ఏపీని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మళ్ళీ రాష్ట్రంలో వెలుగులు నింపే శక్తి టీడీపీకి ఉందని చెప్పుకొచ్చారు. పన్నులపై పన్నులు వేసి..చార్జీలు, కరెంటు బిల్లులు పెంచేశారని ఆరోపించారు. ఇచ్చేది 10 దోచుకునేది 100 అని విమర్శించారు. కలియుగంలో మన ఖర్మ కాలి ఈ ముఖ్యమంత్రి బకాసురుడి మాదిరిగా పుట్టాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల నెత్తిమీద 12 లక్షల కోట్ల అప్పు పెట్టిన జగన్ రేపో మాపో జైలుకు పోతాడని, ఈ అప్పు ఎవడు కడతారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గుడ్ని ఉతికి ఉతికి ఆరేయాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అన్నారు.
విశాఖపట్నాన్ని క్రైమ్ సిటీగా, గంజాయి కేంద్రంగా మార్చేశారని…సాక్షి పత్రికకు వందల కోట్లు దోచి పెట్టాడని ఆరోపించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 ఇస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆడబిడ్డల కోసం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చిస్తామని, పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు.