సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు….తొలి కేబినెట్ లో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవులిస్తే…మలి కేబినెట్ లో 70 శాతం పదవులిచ్చారు…జగన్ మరో పూలే….ఇది బీసీల కేబినెట్…జగనన్న మాటిస్తే తప్పడు…చంద్రబాబు హయాంలో బీసీలకు అరకొర మంత్రి పదవులు దక్కాయి…నిన్న సాయంత్రం కొత్త కేబినెట్ జాబితా విడుదలైనప్పటి నుంచి వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా గగ్గోలు పెడుతున్న పాయింట్లు ఇవి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ డీఎన్ఏలోనే బీసీల అభివృద్ధి ఉందని, ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో అన్ని రాజకీయ పక్షాలు బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీలది, టీడీపీది విడదీయరాని అనుబంధం అని, టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనేది ఎవరూ కాదనలేని వాస్తవమని చంద్రబాబు అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయని, అందుకు టీడీపీకి బీసీల పట్ల ఉన్న నిబద్ధతే కారణమని చెప్పారు. రాష్ట్రంలో టీటీడీ చైర్మన్ పదవితో పాటు 16 వర్సిటీల్లో 9 వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా బీసీలను నియమించిన ఘనత టీడీపీదేనన్నారు. ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించామని, వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు.
దేశంలో తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించిన చంద్రబాబు…ఫూలే వంటి మహోన్నతుల ఆశయ స్ఫూర్తితో టీడీపీని స్థాపించామన్నారు. వెనుకబడిన వర్గాల్లో రాజకీయ చైతన్యం కలిగించి, వారిలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పురోగతికి 40 ఏళ్లుగా టీడీపీ కృషి చేస్తోందని తెలిపారు.