ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి….ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి….విశ్రమించవద్దు ఏ క్షణం…విస్మరించవద్దు నిర్ణయం…అప్పుడే నీ జయం నిశ్చయంరా…’పట్టుదల’ చిత్రంలోని ఈ పాట ఎందరికో స్ఫూర్తి దాయకం…జీవితంలో పట్టుదలతో పోరాడితే విజయం మనదేనని చాటి చెప్పే ఈ పాట ఎందరినో కదిలించింది…మరెందరినో ముందుకు నడిపించింది. అయితే, ఈ పాటలోని ప్రతి పదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగిన వ్యక్తి ఒకరున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయాలు సాధిస్తున్న విజన్ ఉన్న నాయకుడిగా ఆ వ్యక్తి ముందుకు సాగుతున్నారు.
మొక్కవోని దీక్షతో అడ్డంకులు, అవరోధాలనే ఆయుధాలుగా మలుచుకొని ముందుకు సాగితే ఓటమి కూడా మనల్ని చూసి పారిపోతుదంని నిరూపించిన వ్యక్తి మరెవరో కాదు…టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో అభివృద్ది ప్రణాళికలు రచించిన చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టారు. కోట్లాది తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణానికి నడుం బిగించారు.
నిర్మాణం అంటే ఇసుక,ఇటుకలు,సిమెంట్ కాదని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ఆకారమని,కలలకు సాకారమని అమరావతి నిర్మాణం సాక్షిగా నిరూపించాలనుకొన్నారు. చంద్రబాబు ఒక్క పిలుపుతో స్పందించిన రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం నభూతో నభవిష్యత్. అయితే, చంద్రబాబు కలను జగన్ నాశనం చేశారు. అమరావతికి తూట్లు పొడుస్తూ రాజధానిని తరలించాలని కుట్ర చేశారు.
అయితేనేం, అదరని బెదరని చంద్రబాబు…ఆ తాటాకు చప్పుళ్లకు భయపడలేదు. ఆరు నూరైనా…అమరావతే ఆంధ్రుల రాజధాని అని బలంగా నమ్మారు. తాను నమ్మడమే కాదు…టీడీడీ కార్యకర్తలు, అమరావతి రైతులు, అమరావతే రాజధానిగా ఉండాలనుకున్న ప్రతి ఒక్క ఆంధ్రుడికి వెన్నులో ధైర్యాన్ని నింపారు. అమరావతి రైతుల పోరాటానికి అను నిత్యం మద్దతు తెలిపారు. ఆ పట్టువదలని దీక్ష కారణంగానే నేడు అమరావతే రాజధాని అని తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా అమరావతి గురించి గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
”ఇంద్రుడు స్వర్గలోకానికి రాజు…దానికి రాజధాని అమరావతి…అమరావతికి చావులేదు..అమరావతిని ఎవరైనా చంపాలనుకున్నా, అమరావతిని దెబ్బతీయాలనుకున్నా..వారి ప్రయత్నాలన్నీ కుటిల ప్రయత్నాలుగా మిగిలిపోతాయే తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు” అంటూ చంద్రబాబు గతంలో బల్లగుద్ది మరీ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యమయ్యాయి. అమరావతిని అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు చంద్రబాబు చెప్పినట్లే దానిని వారు ఏమీ చేయలేకపోయారు.