ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం.. అదేసమయంలో సీఎం కేసీఆర్ రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. “అహంకారంతో విర్రవీగితే.. శిక్ష తప్పదు“ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన ఎవరి పేరు చెప్పలేదు. ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించలేదు. కానీ, ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా మంటలు రేపుతున్నాయి.
ఏం జరిగింది?
భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ధర్మ పరిరక్షణ జరగాలని తాను దేవుడ్ని ప్రార్థించానని చెప్పారు. హిరణ్యకశపుడు అహం కారంతో విర్రవీగితే…మహా విష్ణువు నరసింహ స్వామి రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని శిక్షించారని అన్నారు. రాష్ట్రాన్ని దుష్టుల నుంచి కాపాడమని ప్రార్థించాను అన్నారు. ఏ రాజకీయ నాయకుడికీ దక్కని ఆదరణ, మద్దతు తనకు ప్రజల్లో దక్కిందని అన్నారు. తన కోసం ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేశారని.. సంఘీభావం తెలిపారని అన్నారు.
తనకు బాధ్యత మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సేవచేసే శక్తిని ఇవ్వమని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ధర్మాన్ని పూర్తిగా నాశనం చేశారని అన్నారు. ధర్మం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దుష్టశక్తిపై పోరాటం చేసే శక్తిని ఇవ్వమని తాను దేవుడుని ప్రార్థించినట్లు చెప్పారు. అందరూ చేతులు కలిపి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వ సమయంలో సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేదని అన్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే పంచ గ్రామాల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం అన్నారు.